విశాఖ జిల్లా పాడేరులో ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్లారు. వారి పేర్లు ఓటరు లీస్టులో లేక అయోమయానికి గురయ్యారు. పాడేరు ఎంపీటీసీ 2 సెగ్మెంట్లో గుడేపు అమ్మాజీ అనే అభ్యర్థి.. తెదేపా నుంచి పోటీకి అవకాశం దక్కించుకున్నారు. నామపత్రాల దాఖలుకు వెళ్లిన ఆమె.. ఉదయం నుంచి ఓటర్ లీస్టులో పేరుకోసం వెతుకుతూనే ఉన్నారు. అంతర్జాలంలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అలాగే దేవాపురం ఎంపీటీసీ స్థానం అభ్యర్థి ఓటు కూడా గల్లంతైంది. సమయం అయిపోయిన కారణంగా.. ఇరువురూ వెనుదిరగాల్సి వచ్చింది.
ఇద్దరు అభ్యర్థులు తెదేపాకు చెందిన వారే. ఎవరైనా కావాలనే వారి ఓటు తీయించారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నామినేషన్ ప్రక్రికయను పరిశీలించడానికి సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావు వచ్చారు. తన ఓటు లేని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఓటు ఉందో లేదో అని ముందే చూసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆమెకు తెలిపారు.