కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిశా నుంచి రాష్ట్రానికి ప్రాణవాయువు తరలించడానికి ప్రత్యేక ఆక్సిజన్ రైళ్ళను నడపాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మకు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న ఆటంకాలు, ఇబ్బందులను ఆయన లేఖలో వివరించారు. సకాలంలో ఆక్సిజన్ రవాణా ద్వారా వేలాది మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో భారతీయ రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆక్సిజన్ రైళ్ళు విజయవంతం అయ్యాయన్నారు.
ఆక్సిజన్ అవసరం అపరిమితంగా పెరిగిపోయిందని, కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ఆక్సిజన్ కీలకంగా మారిందన్నారు. తగినంత ఆక్సిజన్ సరఫరా కేటాయింపు, రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయంపైనే ఆధారపడిందని విజయసాయి రెడ్డి తన లేఖలో వివరించారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ రవాణా కోసం 10 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కేటాయించవలసిందిగా ఎంపవర్డ్ గ్రూప్ ఛైర్పర్సన్ సునితా దావ్రాను కోరితే, రాష్ట్రానికి కేవలం 2 క్రయోజెనిక్ ట్యాంకర్లను మాత్రమే కేటాయించారన్నారు.. సాయం చిన్నపాటిదే అయినా ఆమెకు ధన్యవాదాలు చెబుతూనే, ఒడిశా నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ నిల్వలను రవాణా చేయడానికి ఇవి చాలవన్నారు.