విశాఖ మధురవాడలోని బక్కనపాలెంలో కేంద్ర ఇంటలిజెన్స్ ఎస్పీ మధుకు చెందిన స్థలంలో ప్రహరీ నిర్మాణాన్ని ఆపేసిన ఘటనపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. తానూ ఎవరి స్థలాన్ని ఆక్రమించలేదని స్పష్టం చేశారు. రహదారికి అడ్డంగా ప్రహరీ నిర్మిస్తుంటే స్ధానికుల సమాచారం మేరకు ఆపమని పోలీసులను కోరానని అన్నారు. ప్రజల సౌకర్యం కోసమే కల్వర్టును నిర్మించామన్నారు. ఎస్పీ మధు స్థలానికి అన్ని అనుమతులు ఉంటే.. ఆయన ఏ నిర్మాణమైనా చేసుకోవచ్చునన్నారు. ప్రహరీ నిర్మాణానికి కూడా జీవీఎంసీ అనుమతి ఉండాలని ఎంపీ వ్యాఖ్యానించారు.
వివాదం ఏంటంటే..:విశాఖ నగరం మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతంలో గాయత్రి నగర్ నుంచి సాయిప్రియ లేఅవుట్‌కు వెళ్లే మార్గంలోని రోడ్డును మూసేసి, దాని మధ్యలో ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించడం వివాదాస్పదమవుతోంది. ఈ రోడ్డుకు బదులుగా మురుగు కాలువపై అనుమతి లేకుండానే కల్వర్టు నిర్మించారు. దానికి ఆనుకుని ఉన్న తన స్థలంలో నిర్మాణ పనులు చేపట్టగా ఎంవీవీ వెంచర్స్‌కు చెందిన మనుషులు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారంటూ.. ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు ఆరోపిస్తున్నారు. ఐపీఎస్ అధికారినైన తన స్థలానికే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన మధు.. ఆదివారం విలేకరులతో మాట్లాడారు.