కళామ్మతల్లి ఒడిలో ఒదిగి, ఎదిగిన కళాకారులు.. సినీ, టీవీ రంగంలో దాదాపు 40 ఏళ్లుగా వివిధ విభాగాల్లో సేవల్ని అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. కరోనా మహమ్మారి వీరి జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. సినీ, టివి రంగంలో ఉండే 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులంతా గత 120 రోజులుగా షూటింగులు లేక ఉపాధి కరువై సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సినీ పరిశ్రమ పెద్దలు తమ వంతు సాయం అందిస్తున్నా అవి తమ దాకా రావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమపై విశాఖ జిల్లాకు చెందిన 7,500 మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నామని కళాకారుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఉపాధి కోల్పోయిన అనేక రంగాలను ఆదుకున్న ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని వీరు కోరుకుంటున్నారు. తమకు ఇతర ఏ వృత్తులు చేతకావని.. కేవలం సినీ, టీవీ రంగములోనే కొన్నేళ్లుగా స్థిరపడి ఉన్నామని.. ఇప్పుడు ఉపాధి కోల్పోయి డబ్బులు లేక రోడ్డునపడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాగరతీరం షూటింగులు లేక బోసిపోయిన.... కళాకారులకు ఉపాధి లేక చేతిలో చిల్లిగవ్వలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకోవాలని కోరుతూ విశాఖలో సినీ, టీవీ కళాకారులు నిరసన చేపట్టారు. ఏపీ స్టేట్ తెలుగు ఫిల్మ్, టీవీ ఇండస్ట్రీ అసోసియేటెడ్, ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ కు చెందిన కళాకారులు, కార్మికులంతా జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.