Traffic Problems at Lankelapalem Junction : రాష్ట్రంలోని ప్రధాన పరిశ్రమలు, ఓడరేవు, చూడచక్కని పర్యాటక ప్రదేశాలు భారతదేశానికి తూర్పు నౌకా దళం వంటి ఇన్ని ప్రత్యేకతలున్న ఉమ్మడి విశాఖ జిల్లాకు ఇంకా ట్రాఫిక్ సమస్యలు వీడటం లేదు. విశాఖలో అత్యంత ప్రధానమైన లంకెలపాలెం కూడలిలో జాతీయ రహదారి 16 పై ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల మంది ఉపాధికి నెలవైన అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మసిటీలకు.. నిత్యం ఉద్యోగులను తీసుకువెళ్లే వాహనాలు ఈ కూడలి మీదుగానే వెళ్తున్నాయి. వీటికితోడు సరుకు రవాణా చేసే భారీ వాహనాలతో కూడలి మరింత రద్దీగా మారుతోంది.
విశాఖ నగరానికి రావాలంటే లంకెలపాలెం ఒక ముఖ ద్వారం. ఇక్కడ నుంచి రోజు వందల వాహనాలు, వేల సంఖ్యలో మనుషులు, పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వాహనాలు ఈ కూడలి ద్వారానే వెళతాయి. ఎందుకంటే ఇది ఎంత ప్రధానమైన కూడలంటే విశాఖ నగరానికి దాదాపు 35 కిలోమీటర్లు దూరం ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి అచ్యుతాపురం ఫార్మాసిటి వైపు భారీ వాహనాలు వెళ్తాయి. అంతే కాకుండా విజయ నగరం, సబ్బవరం, విశాఖ నగరానికి వెళ్లే వాహనాళ్లన్ని ఈ కూడలి ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఐతే ఇక్కడ ప్రధాన సమస్య ఈ జంక్షన్ అత్యంత ఇరుకైన జంక్షన్లలో ఒకటి. ఇక్కడ ఫ్లైఓవర్ కాని పెద్ద ఎత్తున వాహనాలు వెళ్లడానికి భద్రతా సౌకర్యాలు కాని.. ఏమి లేవు.
డ్యూటీ సమయంలో ఈ ట్రాఫిక్ వల్ల దాదాపు 2, 3 గంటలు ఆలస్యమవుతుంది. లారీలు తిరగడం వల్ల కాలుష్యం అధికమౌతుంది. దీనికి పరిష్కారంగా రహదారి విస్తరణ చేయాలి. -వాహనదారుడు