విశాఖ నగరం తాడివీధిలో నివాసముంటున్న టేకుమూడి సుగుణ, రాంబాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పదేళ్ల క్రితం రాంబాబు చనిపోయాడు. పెద్ద కుమార్తె ప్రసాద్ గార్డెన్స్‌లో, చిన్న కుమార్తె అరిలోవలో నివాసముంటున్నారు. కుమారుడు టేకుమూడి శ్యామ్ కుమార్ తల్లి సుగుణ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన శ్యామ్... డబ్బులు ఇవ్వాలంటూ తల్లి సుగుణను వేధించేవాడు. శ్యామ్ ప్రవర్తనతో విసుగు చెందిన సుగుణమ్మ అతనిని అంతమొందించాలని పథకం రచించింది.
తాడుతో ఉరి బిగించి...
యథాప్రకారం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని శ్యామ్... తల్లి సుగుణమ్మను వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుగుణమ్మ తన కూతుళ్లు, అల్లుళ్లకు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ముందస్తు పథకం ప్రకారం శ్యామ్ కాళ్లు చేతులను గట్టిగా పట్టుకుని తాడుతో మెడ బిగించి మొహంపై దిండు పెట్టి హత్య చేశారు.