రాష్ట్రవ్యాప్తంగా భూములను ప్రభుత్వం కాపాడుతుంటే... ప్రతిపక్ష నేతలు కక్ష సాధింపుగా అభివర్ణించడం హాస్యాస్పదమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని రుషికొండ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం తప్పు అని ఏ ఒక్క సామాన్యుడు చెప్పినా... అక్రమ నిర్మాణాల తొలగింపు వెంటనే నిలిపివేస్తామని ఆయన చెప్పారు. గీతం యూనివర్సిటీకి 30 ఎకరాలు సొంత భూములున్నప్పటికీ... ప్రభుత్వ భూములను ఆక్రమించే ఆలోచన చేశారని ఆరోపించారు.
భూములను రెగ్యులర్ చేయమని ఆగస్టు 3న ముఖ్యమంత్రి జగన్కు గీతం యాజమాన్యం లేఖ రాసిందని... ఇంతకంటే రుజువు ఏం కావాలని ఎమ్మెల్యే అన్నారు. గీతం యాజమాన్యం కోర్టులో 54పేజీల రిట్ పిటిషన్ వేసిందన్న ఆయన... భూమిపై హక్కు తమదే అంటూ ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాపాడే యజ్ఞం చేపట్టారని పేర్కొన్నారు. సర్కార్ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటామన్నారు.