కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ క్యాంపు కార్యాలయంలో కొవిడ్-19పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ గోవిందరావు, డీఎంహెచ్ఓ తిరుపతిరావు, కేజీహెచ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ తదితరులు హాజరయ్యారు.
ఆసుపత్రులలో వైద్యులు, ఇతర సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాలన్నారు. కొన్ని సందర్భాల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియడం లేదని... ఈ సమస్య లేకుండా బాధితుల వివరాలతోపాటు వారి బంధువుల ఫోన్ నెంబర్ తీసుకోవాలని సూచించారు. ఒప్పంద పద్ధతిలో 213 మంది నర్సింగ్ సిబ్బందిని, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, పారామెడికల్ సిబ్బందితో కలిపి మొత్తం 370 మందిని నియమిస్తున్నామన్నారు. కొత్తగా 55 మంది వైద్యులను తీసుకోనున్నట్లు చెప్పారు. ఆసుపత్రి వార్డులతోపాటు చుట్టుపక్కల ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 2 వారాలకొకసారి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడతానని మంత్రి అన్నారు.