పర్యావరణాన్ని పరిరక్షించడం మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకమని పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 71వ వనమహోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. కరవుకాటకాల నివారణకు మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని మంత్రి కోరారు. వన మహోత్సవాల సందర్భంగా జిల్లాలో 3 కోట్ల 31 లక్షల మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. విశాఖ జిల్లాలో 2 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 1000 పార్కులలో చెట్లను పెంచి హరిత విశాఖగా తీర్చిదిద్దుతామన్నారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించి, శానిటైజర్ వినియోగించాలని, వ్యాక్సిన్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల సంక్షేమానికి రూ.45 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ ప్రచురించిన బుక్ లెట్‌ను మంత్రి విడుదల చేశారు.