Minister Amarnath : ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దుతామని, ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేందుకే సీఎం జగన్ పలు నిబద్ధతతో కూడిన శంకుస్థాపనలు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్ట్‌కి తానే శంకుస్థాపన చేశానని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు.. ఇకనైనా అసత్యాలు మానుకోవాలని పేర్కొన్నారు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం నెల రోజులు ముందు శంకుస్థాపన చేసి బాబు చేతులు దులుపుకున్నాడు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లోని రన్ వే కి సంబంధించిన 40 ఎకరాల భూమి కోర్టు వివాదాల్లో ఉండగా ఆయన ఏ విధంగా శంకుస్థాపన చేశాడని అమర్నాథ్ ప్రశ్నించారు. అలాగే రామాయపట్నం పోర్టుకి ఎటువంటి క్లియరెన్స్ రాకపోయినా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏ విధంగా శిలాఫలకం వేశారని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేట పోర్టు, అదానీ డేటా సెంటర్ వంటి అనేక బృహత్తర ప్రాజెక్టులను ప్రారంభిస్తామని సీఎం చెప్పి... వాస్తవ రూపం కల్పిస్తున్నారని మంత్రి అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, చంద్రబాబు నాయుడు కలయిక నేపథ్యంలో వస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలపై అమర్నాథ్ స్పందిస్తూ సినిమాల్లో సూపర్ స్టార్ అయినా, రాజకీయాలకు వస్తే విమర్శలు భరించాలని, అది సాధ్యం కాకనే రజనీకాంత్ రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లారని అన్నారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడినవన్నీ వాస్తవాలే అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.