ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం: మంత్రి బొత్స

By

Published : Mar 17, 2021, 6:59 AM IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని.. మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రధానిని కలిసేందుకు అఖిల పక్షాలతో కలిసి వస్తామని.. ప్రధానికి సీఎం జగన్ లేఖ రాసినట్లు మంత్రి గుర్తు చేశారు.

minister botsa satyanarayana speaks over steel plant privatisation issue
స్టీల్ ప్లాంట్ కార్మికులకు అందరూ అండగా నిలిచే సమయం: మంత్రి బొత్స

విశాఖ స్టీల్‌ ప్లాంట్ విషయంలో.. తమ విన్నపాలకు కేంద్రం తీసుకునే చర్యల్ని బట్టే తమ విధివిధానాలు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడంలో భాగంగా.. ఉద్యోగ సంఘాలు, అఖిలపక్షం ప్రతినిధులతో వస్తామని, నేరుగా కలిసేందుకు సమయం ఇవ్వాలని ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాశారని మంత్రి గుర్తుచేశారు. కార్మికులకు అంతా అండగా ఉండాల్సిన సమయం ఇదని.. విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి చెప్పారు.

'తప్పుచేసిన వారు దొరక్కుండా ఉండరు'

అమరావతి రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో ఏనాటికైనా తప్పుచేసిన వారు దొరక్కుండా ఉండరని.. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖలో ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయమై చాలా ఫిర్యాదులే వచ్చాయని తెలిపారు. తన దగ్గరికి ప్రత్యక్షంగా 100 మంది బాధితులు వచ్చారని చెప్పారు. కొందరు.. వారి భూముల్ని రూ.5లక్షలకు, రూ.10 లక్షలకు తీసుకున్నారని.. దీపావళి తర్వాత మరో రూ.20 లక్షలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టేశారని వారంతా ఆవేదన చెందారన్నారు.

'సమాధానం చెప్పండి'

‘రెండేళ్లయ్యింది.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో ఏం చేశారు?' అని లోకేష్‌ అన్నారని బొత్స గుర్తు చేశారు. ఇప్పుడు చట్ట ప్రక్రియలో భాగంగానే నోటీసులిచ్చినట్టు స్పష్టం చేశారు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ భూములపై జీవోలు విడుదల చేసిన వారిలో అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి, ఇతర అధికారులందర్నీ ప్రశ్నిస్తారన్నారు. ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టిందని చెప్పారు. మిగిలిన వ్యాజ్యాలపైనా త్వరలో తీర్పులు వస్తాయన్నారు. అవి రాగానే పరిపాలన వికేంద్రీకరణను చేపడతామని తెలిపారు.. మంత్రి బొత్స.

ఇదీ చదవండి:

ఎమ్మెల్సీ ఎన్నికలు: ఉపాధ్యాయుల తీర్పు వెల్లడి నేడే

ABOUT THE AUTHOR

...view details