రాజధాని అమరావతిపై పురుపాలకమంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వ్యాఖ్యలు చేశారు. అమరావతి అందరిదీ.. అని.. కేవలం ఓ సామాజిక వర్గానికి చెందినది కాదన్న విషయాన్ని ప్రతిపక్షం గుర్తించాలన్నారు. అమరావతిపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఏ విషయంలో క్లారిటీ కావాలని ప్రశ్నించారు. రాజధాని అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని.. ఈ విషయంలో ప్రజలందరికీ స్పష్టత ఉందని, క్లారిటీ లేనిది తండ్రీ కొడుకులకే అని ఎద్దేవా చేశారు.
అమరావతిలో దోపిడీ నిజం కాదా..?
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వ్యక్తిగత ఆరాధన కోసం వ్యవస్థలు ఛిన్నాభిన్నం చేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అమరావతిలో కేవలం ఒకే ఒక్క శాశ్వత కట్టడాన్ని నిర్మించి.. చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో చంద్రబాబు బంధువులు, నేతలు దోచుకొన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. బాబు..లోకేష్‌ల బాధ కేవలం తమ వియ్యంకులు, బంధువుల కోసమేనన్నారు.