నిపుణుల కమిటీ నివేదికపై మంత్రివర్గ భేటీలో చర్చించాకే... రాజధానులపై నిర్ణయం వెల్లడిస్తామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూములు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నివేదికలో సిఫార్సులు ఉన్నాయన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఉండాలని నిపుణులు సూచించారని మంత్రి తెలిపారు. జిల్లాల్లో పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో సీఎంకు అందజేశారన్నారు. గతంలో రాజధాని భూముల పేరిట అవినీతి, దోపిడీ జరిగిందన్నారు. రైతులు చంద్రబాబు మాయలో పడి మోసపోవద్దన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఒక సామాజిక వర్గం, ఒక మతానికి ఈ ప్రభుత్వం కొమ్ము కాయదన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి.. రైతులు ఆందోళన విరమించాలని కోరారు. పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని బొత్స చెప్పారు. ప్రాంతీయ అసమానతలు ఉండకూడదనే కమిటీ వేశామన్న మంత్రి... శ్రీకృష్ణ, శివరామకృష్ణ, జీఎన్ రావు కమిటీ నివేదికలు దగ్గరగా ఉన్నాయన్నారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.