తెదేపా కార్యాలయంలో కాకి తగిలి కరెంటు పోయింది:అవంతి ముఖ్యమంత్రిని రోజూ తిడితే.. సానుభూతి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై అవంతి తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావించిన తరువాత వరదలు, వర్షాలు వచ్చాయని పేర్కొన్నారు. అయినా మూడు నెలలు సీజన్ కానందున ఇబ్బంది లేదని తెలిపారు. డీజీపీ, పోలీసులను బెదిరించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా కరెంటు పోవడంపైనా అవంతి స్పందించారు. కాకి తగిలి రెండుసార్లు కరెంటు పోయిందని చెప్పారు. రెండు సెకన్లు కరెంటు లేకపోతేనే చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.