విశాఖ జిల్లా సింహాచలంలో వెలసిన సింహాద్రి అప్పన్న స్వామిని మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రసాద్ పథకం ద్వారా తిరుమల తరహాలో సింహాచలం దేవస్థానంను అభివృద్ధి చేస్తామని అన్నారు.
దేవస్థానం అభివృద్ధికి, పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు 53.69 కోట్ల రూపాయలతో ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు.
కొండపైన వసతులకు 18.21 కోట్లు
ఎల్ఈడీ దీపాలతో ఆలయ కాంప్లెక్స్ నవీకరణ, కొండ మీదకు వచ్చే పాత, కొత్త మార్గాల్లో 6 మీటర్ల వెడల్పుతో 2 కి.మీ పొడువున విస్తరిస్తామని మంత్రి తెలిపారు. యాత్రికుల కోసం కొండపైన సత్తెమ్మ ఆలయం వద్ద విశ్రాంతి గదులు నిర్మిస్తామని అన్నారు. అదనపు క్యూ కాంప్లెక్స్‌లు, ఉన్నవాటి స్థానంలో కొత్తవి నిర్మించటం జరుగుతుందని వివరించారు.
ఇతర వసతులకు 3.87 కోట్లు
మాధవధార నుంచి సింహాచలం కొండపైకి తాగునీటి పైపులైను ఏర్పాటు చేస్తామని ముత్తంశెట్టి వెల్లడించారు. 14 సీట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు బస్సులు, వాటికి అవసరమైన నిర్వహణ, ఛార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తామని తెలిపారు.
కొండ కింద పనులకు 27.86 కోట్లు
మాధవధార స్వామి ఆలయం నుంచి సింహాచలం కొండ మీదున్న ఆలయానికి మెట్ల మార్గాన్ని ఆధునికీకరణ చేయిస్తామని మంత్రి వివరించారు. పాత పుష్కరిణి చౌల్ట్రీ ప్రాంతంలో యాత్రికుల కోసం విశ్రాంతి మందిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొండ కింద ఉన్న పుష్కరిణి సుందరీకరించి.. అక్కడే దుస్తులు మార్చుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల కింద నిధులు విడుదల చేయాలని వెయ్యు కోట్లతో ప్రతిపాదన పెట్టినట్లు మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి:'ప్రసాద్' పథకానికి సింహాచలం ఆలయం ఎంపిక.. రూ.53 కోట్లు విడుదల