Milan 2022: బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం మిలన్ - 2022 ప్రారంభమైంది. 8 రోజుల పాటు రెండు దశల్లో పాల్గొనేందుకు.. పలు దేశాలకు చెందిన నౌకలు విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. నేటినుంచి ఈ నెల 28 వరకు హార్బర్ దశగా పరిగణిస్తారు. మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు సముద్ర దశలో ఈ విన్యాసాలు జరుగనున్నాయి.
హార్బర్ దశలో భాగంగా తొలిరోజున సాంకేతిక అంశాలను వివిధ నేవీల ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వారికి భారత నౌకాదళం పలు అంశాలను వివరిస్తూనే, వారి నుంచి సాంకేతికతలను తెలుసుకుంటోంది. శనివారం తూర్పు నౌకాదళంలో నేవీల ఆధునికతపై సదస్సు నిర్వహించనుండగా.. పలు దేశాల నావీ అధికార్లు హాజరవనున్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సాంగత్యం, పొందిక, సహకారం (‘Camaraderie – Cohesion – Collaboration’) అన్నలక్ష్యాలుగా ఈ మిలన్ నిర్వహణను చేపట్టారు. ఆదివారం నాడు విశాఖ ఆర్కే బీచ్ లో అంతర్జాతీయ సిటీ పరేడ్ జరగనుంది. ఇందులో నేవీ కవాతుతో పాటుగా, సాంస్కృతిక బృందాలు వివిధ సంస్కృతులకు అద్దంపట్టేలా సాగుతాయి. ఆ కార్యక్రమానికి నౌకాదళ చీఫ్ తో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవనున్నారు. ఈనెల 27 న నగరానికి విచ్చేయనున్న సీఎం.. ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖ నౌక, జలాంతర్గామి ఐఎన్ఎస్ లను కూడా సందర్శించనున్నారు.