ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారు అక్కడ పస్తులతో పడుకుంటున్నారు' - విశాఖలో లాక్​డౌన్

లాక్ డౌన్ కారణంగా... విశాఖలో ఇరుక్కున్న వలసకూలీలు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబాన్ని పోషించుకులేక.. కనీసం తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.

Migrant laborers problems at visakha
విశాఖలో వలస కూలీల సమస్యలు
author img

By

Published : Apr 14, 2020, 4:51 PM IST

ఇతర దేశస్తులను విశాఖ నుంచి వారి దేశాలకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నా.. ఇక్కడ చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వాసుల్ని మాత్రం తమ స్వస్థలాలకు పంపడం లేదని పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పనుల కోసం విశాఖ వచ్చిన వలస కూలీలు... తమ కుటుంబ సభ్యుల దయనీయ పరిస్థితిని తలుచుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. నిర్మాణరంగం, ఇతర రంగాల్లో పనిచేసేందుకు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. వారు సంపాదించుకునే డబ్బును బ్యాంకుల ద్వారా స్వస్థలాల్లోని కుటుంబ సభ్యులకు పంపుతుంటారు. లాక్​డౌన్ ఒక్కసారిగా వారి జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. పనులు లేకపోవడంతో ..వారి దగ్గర చిల్లిగవ్వకూడా లేదు. దీంతో జీవీఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతిగృహాల్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పలువురు దాతలు వారికి ఆహారం అందిస్తున్నారు.

ప్రభుత్వసాయం వారికి అందటంలేదు

వారి స్వస్థలాల్లో ఉండే కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం అందకపోవడంతో ఆకలితో అలమటించి పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమలాంటి నిరుపేద కుటుంబాలు లాక్‌డౌన్‌ కారణంగా తిండిలేక చచ్చిపోవాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన సుమారు 600 మంది ఉండగా, ఇతర జిల్లాలకు చెందిన వారు 300 మంది ఉన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో లేకుండా ప్రైవేటుగా ఆశ్రయం పొందుతున్న ఇతర రాష్ట్రాల వాసుల సంఖ్య కూడా ఎక్కువ ఉందని అధికారులు తెలిపారు.

మమ్మల్ని ఇక్కడినుంచి పంపించండి సారూ..

తమ భార్యాపిల్లలు ఆకలితోనే చచ్చిపోతారేమోనని భయం వేస్తోందని ఉత్తరప్రదేశ్​కి చెందిన ఓకూలీ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వం నుంచి వారికి సాయం అందట్లేదని.. రోజూ పిల్లలు పస్తులతోనే పడుకుంటున్నారని కూలీలు ఆందోళన చెందుతున్నారు. తమను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపిస్తే తమ భార్య, పిల్లల ప్రాణాల్ని కాపాడుకుంటామని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.

ఇదీ చూడండి:

అమ్మ ప్రేమ ఒక వైపు... కరోనా కట్టడి బాధ్యత మరోవైపు!

ABOUT THE AUTHOR

...view details