Metered Charges For Taps In Towns: రాష్ట్రంలోని వివిధ పుర, నగర పాలక సంస్థల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2 వేల కోట్ల రూపాయలతో అమృత్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయడం, రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, ఇప్పటికీ కుళాయిలకు నోచుకోని ప్రాంతాల్లోని ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం పథక ప్రధాన ఉద్దేశం. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కడప తదితర నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభించారు. విశాఖలోని రెండు వార్డుల్లో కొద్దికాలంగా 24 గంటలూ నీటిని సర ఫరా చేస్తున్నారు. విజయవాడలోని రెండు డివిజన్లలో పనులు పూర్తిచేసి, ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు.
విజయవాడలోని మధురానగర్, పసుపునగర్ లో ఇళ్లకు కొత్తగా ఇస్తున్న కనెక్షన్లతోపాటు మీటర్లను బిగిస్తున్నారు. విశాఖలోనూ అతి త్వరలో మీటర్ల బిగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, అపార్ట్మెంట్లలో కుళాయి కనెక్షన్లకు ప్రస్తుతానికి మీటర్లు ఉన్నాయి. వీరి నుంచి రుసుములు వసూలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని వ్యక్తిగత ఇళ్లకూ వర్తింపజేస్తారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పుర, నగరపాలక సంస్థల్లో ఇప్పటివరకు కుళాయిపై నెలకు కనిష్ఠంగా 60, గరిష్టంగా 120 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే తాగునీటి సరఫరా కోసం చేస్తున్న ఖర్చుకు సమానంగా ఆదాయాన్ని సమకూర్చుకునే లక్ష్యంతో పుర, నగరపాలక సంస్థల అధికారులు ఈ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.