పద్దెనిమిది ఏళ్లకే ఆమెకు వివాహమైంది. కోటి ఆశలతో అత్తారింటికి వెళ్తే అక్కడ వేధింపులు, భర్త నిరాదరణ ఎదురయ్యాయి. తన పెళ్లిని ఘనంగా చేయటం కోసం తల్లిదండ్రులు చేసిన అప్పులు ఆమెను మరింత వేదనకు గురి చేశాయి. తాను పడ్డ వేదనకు 50 పేజీల అక్షర రూపం ఇచ్చి ఆమె కనిపించకుండా పోయింది.
విశాఖ జిల్లాకు హరిపాలానికి చెందిన ఓ యువతికి 2018లో ఆమెకు పద్దెనిమిదేళ్ల వయసున్నప్పుడు గాజువాకకు చెందిన డొప్ప శ్రీనివాసరావుతో వివాహమైంది. అతడు హైదరాబాద్లో ఐడీబీఐ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. అప్పుచేసి పెద్ద ఎత్తున బంగారం ఇచ్చి అత్తారింటికి పంపారు ఆమె తల్లిదండ్రులు. అప్పటి నుంచి ఆమెకు ప్రతిరోజు వేధింపులే. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని ఏడాదిన్నర పాటు ఏ విషయం వారి చెప్పనేలేదు. చెప్పిన తర్వాత కూడా కొన్ని రోజులు భర్తతోనే ఉండాలని తల్లిదండ్రులు, బంధువులు నచ్చజెప్పారు. తన బాధను అక్షరాల రూపంలో 50 పేజీల డెయిరీ నింపింది. అనకాపల్లిలోని తన బంధువుల ఇంటికి వెళ్లి... డెయిరీని అక్కడ వదిలేసి వెళ్లిపోయింది.