విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ.. ఇద్దరు గిరిజనులను హతమార్చడమే కాకుండా మరో గిరిజనుడిని తీవ్రంగా గాయపరిచారు.
విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య - హత్య
విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను హత్య చేశారు. మృతులు చింతపల్లి మండలం వీరవరం గ్రామస్థులైన రాజారావు, సత్తిబాబు.
స్థానికులు, కుటుంబీకుల వివరాల ప్రకారం...
ఏజెన్సీలో చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో గురువారం తెల్లవారుజామున మారణాయుధాలతో కొంతమంది మావోయిస్టులు ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న పాంగి రాజారావు, ఎమ్మిలి సత్తిబాబు, లింగరాజులను ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ పాంగి రాజారావు, ఎమ్మిలి సత్తిబాబులపై కాల్పులు జరపడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో గిరిజనుడు లింగరాజు తనను వదిలేయమని ప్రాధాయపడటంతో విచక్షణారహితంగా చితక్కొట్టారు. పద్ధతి మార్చుకోకపోతే వీరిద్దరికీ పట్టిన గతే నీకూ పడుతుందని హెచ్చరించి విడిచిపెట్టారు.