అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరిని విశాఖ జిల్లా జి.మాడుగుల పోలీసులు అరెస్టు చేసి... జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారన్నా సమాచారంతో ఇరువురిపై కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వీరిని పోలీసులు విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.
రెండేళ్ల క్రితం జి.మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన మావోయిస్టులను విచారించగా అంజమ్మ, రాజేశ్వరితో పాటు మరి కొందరి పేర్లను ప్రస్తావించడంతో అప్పట్లోనే వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇదివరకే ముగ్గురిని అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం జి.మాడుగుల పోలీసులు గుంటూరు జిల్లాకు వెళ్లి అంజమ్మ, రాజేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై రాజద్రోహం కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.