AOB Maoist comments on Employees Protest : ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 34%, హెచ్‌ఆర్‌ఏ 30 శాతంతోపాటు సీసీఏను యథావిధిగా కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏవోబీ ఎస్‌జడ్‌సీ (ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట జనవరి 14న రాసిన లేఖను విడుదల చేసింది. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు గురికాకుండా రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది. ఇవీ లేఖలోని మరిన్ని వివరాలు..
- ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్‌మెంట్‌తో జీతాల్లో కోత ఏర్పడి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. రోజురోజుకూ ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్‌ఆర్‌ఏను తగ్గించడమేంటి?
- గ్రామ/వార్డు సచివాలయాలను 2019 అక్టోబరు 2న ప్రారంభించి.. అందులో పనిచేస్తున్న సిబ్బందికి రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ ఖరారు చేసి, శాశ్వత ఉద్యోగులతోపాటే జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. దీంతో ప్రైవేటు సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో కొందరు ప్రభుత్వంపై నమ్మకంతో రూ.15 వేల తక్కువ జీతానికి సైతం ఉద్యోగంలో చేరారు. వారందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి సంక్షేమ పథకాలకు అనర్హులుగా తేల్చారు. ఫలితంగా వారికి రేషన్ కార్డు, పింఛన్‌తోపాటు ‘నవరత్నాలు’ ఏవీ వర్తించడం లేదు. ప్రభుత్వమిచ్చే జీతంతో ఇల్లు గడవక.. ఉద్యోగం శాశ్వతం అవుతుందో లేదో తెలియక వారు అల్లాడుతున్నారు.
- 2.32 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చారు. ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తామని.. మెగా డీఎస్సీ అని ప్రకటించారు. ఇప్పటికి మూడు జనవరి నెలలు వెళ్లినా క్యాలెండర్ ఊసేలేదు.
నవరత్నాల పేరిట అప్పులు
నవరత్నాల అమలు పేరిట ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చి... రాష్ట్రాన్ని రుణ ఊబిలో ముంచింది. ఆ భారాన్ని ప్రజల నెత్తిన మోపుతోంది. ఈ పథకాలన్నీ ఉపాధి, అభివృద్ధి సాధించేవి కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత అస్థిర పరచి, సంక్షోభంలోకి నెడుతాయి.