మావోయిస్టు కీలక నేత గెమ్మిలి కామేష్ను విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ మన్యంలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేయటానికి గాలికొండ ఏరియా కమిటీ బాధ్యతలు స్వీకరించిన గెమ్మిలి కామేష్ అలియాస్ కుంకుమపూడి హరి అలియాస్ మాలతి.. పోలీసులకు చిక్కినట్లే చిక్కి.. తప్పించుకుపోయాడు. గూడెంకొత్తవీధి మండలంలోని అటవీప్రాంతంలో ఉన్నట్లు పక్కా సమాచారంతో.. గాలింపు చేసి అరెస్టు చేశారు.
సీపీఐ మావోయిస్టు పార్టీలో 14 ఏళ్లుగా వివిధ క్యాడర్లలో పని చేసిన కామేష్ అలియాస్ హరిపై విశాఖ, తూర్పు గోదావరి, ఒడిశాలో 100కి పైగా కేసులున్నాయి. 5 హత్యలు, 4 మందుపాతరలతో పాటు ఏడు ఎదురుకాల్పుల ఘటనలతో పాటు, తోకరాయి, బత్తునూరు, చెరుకంపాకలు వద్ద జరిగిన ప్రజాకోర్టు ఘటనల్లో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కామేష్పై 4 లక్షల రివార్డు ఉంది.