ఆంద్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టు వారోత్సవాలు మొదలయ్యాయి. బుధవారం నుంచి వారోత్సవాలు ప్రారంభంకావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్దవాతావరణం కనిపిస్తోంది. దీంతో సరిహద్దుల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అమరవీరుల వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ ఒక వైపు మావోయిస్టులు ప్రకటన చేస్తుండగా వీటిని అడ్డుకునేందుకు పోలీసు యంత్రంగం వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అధనంగా పోలీసుబలగాలను రప్పించారు. అవుట్‌పోస్టులు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక్కడ డ్రోన్ కెమెరాలు సహాయంతో నిఘాను మరింతగా పెంచారు. ప్రతీ రోజు డ్రోన్ కెమెరాలతో గగనతలంలో చక్కర్లు కొడుతూ మావోయిస్టుల కదలికలపై నిఘా పెడుతుంది.
మరో వైపు మన్యంలో మావోయిస్టులు ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకుండా ముందజాగ్రత్త చర్యగా వంతెనలు, కల్వర్టులు వద్ద బాంబు నిర్వీర్య బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్థులు వద్ద నిత్యం బందోబస్తు నిర్వహిస్తున్నారు. మన్యంలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పులు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా పోలీసులు తమ గాలింపులను కొనసాగిస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆంధ్రా సరిహద్దుల్లో గురుప్రియ వంతెన వద్ద, పొనసపుట్ తదితర ప్రాంతాల్లో అమరవీరుల పేరిట గతంలో నిర్మించిన స్థూపాలకు వారోత్సవాలు సందర్భంగా రంగులు వేసి ముస్తాబు చేశారు.
మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పీటీడీ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం, హైదరాబాద్‌లకు, అదేవిధంగా భద్రాచలం, హైదరాబాద్‌ల నుంచి విశాఖకు నడిచే బస్సు సర్వీసులను వారం రోజులపాటు రద్దు చేశారు. ఈ సర్వీసులను మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం పునరుద్ధరిస్తామని పీటీడీ అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి: AOB:నేటి నుంచి ఆగస్టు 3 వరకు 'మావోయిస్టు అమర వీరుల వారోత్సవాలు'