ప్రకృతి సహజ అందాలకు నెలవు విశాఖ ఏజెన్సీ. ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండే ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు నామమాత్రమే. ఉన్నత చదువులు పూర్తి చేసిన స్థానిక యువత.. ఉద్యోగాలకు బెంగళూరు, హైదరాబాద్, పుణే లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నైపుణ్యా శిక్షణా కేంద్రాలతో ఈ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. స్థానికంగానే కొలువులు సొంతం చేసుకునే అవకాశాల్ని కల్పిస్తున్నాయి.
మన్యం యువతకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంలో.. విశాఖ జిల్లా పాడేరులో మన్య యువ ప్రగతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.. స్థానిక యువకుడు సింహాచలం. చాలా మంది పేద విద్యార్థులకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించాడు. వివిధ ప్రైవేట్, కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించి.. వారి కాళ్లపై వాళ్లు నిలబడగలిగేలా తీర్చిదిద్దాడు.
ఈ క్రమంలోనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం నిరుద్యోగ యువతలో నైపుణ్యాల కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రవేశపెట్టాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మన్య యువ ప్రగతి సంస్థ.. మన్యం యువతకు కంప్యూటర్స్ సహా వివిధ సర్టిఫికెట్ కోర్సులు నేర్పిస్తోంది. వారందరూ.. వేరే ప్రాంతాల్లో ఉద్యోగాన్వేషణ చేయాల్సిన అవసరం లేకుండా.. ఆ సంస్థ నిర్వహకులే పాడేరు వంటి మారుమూల ప్రాంతంలో మన్యశ్రీ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను ఏర్పాటు చేశారు.