'చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?' - విశాఖపట్నం జిల్లా
విశాఖ జిల్లాలో ఫాం.7 ఉపయోగించి 75 వేల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని.. వాటిని అడ్డుకోవాలంటూ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి మంత్రి అయ్యన్నపాత్రుడు వినతి పత్రం అందించారు.
ఓట్ల తొలగింపు కోసం తామే దరఖాస్తు చేసినట్టు ప్రతిపక్ష నేత జగన్ స్పష్టంగా చెప్పినా ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో చెప్పాలని మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతై ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని.. ఇటు ఏపీలోనూ ఓట్లను గల్లంతు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖ జిల్లాలో 75 వేల ఓట్లను ఫాం.7 ద్వారా తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ .. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఆయన వినతి పత్రాన్ని అందించారు. తెదేపాకి చెందిన ఓట్లను తొలగించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.