ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలతో పాటు చదివి.. డాక్టరయ్యారు ! - vishakapatnam manjula story

అమెరికన్‌ డాలర్లతో కలలు పండించుకోడానికని.. పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే ఇంట్లో ఒంటరి తల్లిదండ్రుల మాటేంటి? తన జీవితంలో ఎదురైన ఈ ప్రశ్నకు సమాధానంగా, ఏకంగా పీహెచ్‌డీనే చేశారు విశాఖకు చెందిన తాటిపాక మంజుల. పీహెచ్‌డీని చాలామంది చేస్తుండొచ్చు. కానీ ఇంటర్‌తో ఆగిపోయిన చదువుని తిరిగి పిల్లలతో పాటు కొనసాగించి రూ.15లక్షల ఉపకార వేతనంతో పీహెచ్‌డీ చేయడం విశేషమేగా మరి..

manjula
manjula

By

Published : Oct 27, 2021, 9:13 AM IST

41 ఏళ్ల వయసులో పీజీ ప్రవేశపరీక్ష రాసి కౌన్సెలింగ్‌కి హాజరయ్యారు మంజుల. ‘ఆంటీ.. రెండు రోజులొచ్చి మానేస్తారులే అన్నారు’ తన తర్వాత ర్యాంకుల్లో ఉన్న పిల్లలు ముసిముసిగా. ‘లేదు పూర్తి చేస్తాను’ అంటూ చిరునవ్వుతోనే వాళ్లకు సమాధానం చెప్పినా, మనసులో మాత్రం ఆ లక్ష్యాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు మంజుల. కారణం అది తన చిన్ననాటి కల. కానీ ఎంటెక్‌ చదివే తన పిల్లలతో కలిసి పీహెచ్‌డీ చేయడం అంత తేలిక కాలేదామెకు. మంజులకు చదువంటే ప్రాణం. తండ్రికీ ఆమెను డాక్టర్‌ చేయాలన్నది కోరిక. కానీ తొమ్మిదేళ్ల వయసులో అమ్మని కోల్పోయాక ఆయన వేరే పెళ్లి చేసుకున్నారు. పరిస్థితులు తారుమారయ్యాయి. 18 ఏళ్లకే పెళ్లిచేశారు ఇంట్లో. పిల్లలు.. కుటుంబ బాధ్యతలతో తీరికే లేకుండా పోయిందామెకు. ఎలా అయితేనేం.. రూరల్‌ వాటర్‌ సప్లైలో ఇంజినీరుగా ఉన్న భర్త విజయరాజు ప్రోత్సాహంతో మళ్లీ చదువు ప్రారంభించారు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో బీఏ చేశారు. ‘ఇద్దరు పిల్లలూ ఇంజినీరింగ్‌లో చేరారు. చిన్నవాడు ఆటలంటే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. వాడిని దారిలో పెట్టేందుకు సరదాకి ‘నేనే చదువుతా.. నువ్వు చదవలేవా’ అన్నా. ఆ మాటలే నేను పీజీ ప్రవేశపరీక్ష రాసి 37వ ర్యాంకు సాధించడానికి కారణమయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో సోషియాలజీ చదువుకునే అవకాశం దక్కించాయి. అలా 2008లో 41 ఏళ్ల వయసులో పీజీలో చేరాను. నన్ను చూసి పిల్లలు గుసగుసలాడుకున్నా పట్టించుకోలేదు. విజయవంతంగా పీజీ పూర్తిచేశాను. ఇంతలో మా పెద్దాడు... పైచదువుల కోసం అమెరికా వెళ్తాన్నాడు. చిన్నతనం నుంచీ అమ్మలేక.. ఒంటరిగా ఉన్ననాకు ఈ మాటలు బాధనిపించాయి.

పిల్లలు విదేశాలకు వెళ్తే ఇక్కడి తల్లిదండ్రుల మాటేంటి? అని నేను వాడిని అడిగిన ప్రశ్ననే నాకు నేను వేసుకున్నాను. దానికి సమాధానంగా ఆ అంశం మీదే పీహెచ్‌డీ చేయాలనుకున్నాను. 2010లో ఎం.ఫిల్‌.లో చేరాను. తర్వాత పీహెచ్‌డీలో చేరాను. కానీ దాన్ని పూర్తిచేయడం అంత తేలిక కాలేదు. దీనికి సంబంధించిన సమాచార సేకరణ, విశ్లేషణ, అధ్యయనం పూర్తి చేయడానికి చాలా కాలం పట్టింది. అమెరికా వలస వెళ్లిన వారితో మాట్లాడాను. అలాగే ఊర్లలో ఒంటరిగా మిగిలిపోయిన తల్లిదండ్రులనీ కలిశాను. ప్రతి సెమినార్‌కీ హాజరయ్యే దాన్ని. పరిశోధనా పత్రాలు సమర్పించాను. అంత కష్టపడినా రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌కు ఎంపికై రూ.15లక్షల వరకు ఉపకారవేతనం పొందడం సంతోషంగా అనిపించింది. 2018లో పీహెచ్‌డీ పట్టా పొందా’ అంటున్న మంజుల అక్కడితో తన ప్రయాణాన్ని ఆపలేదు. ఆంగ్ల భాషాప్రావీణ్యం పెంచుకోవాలన్న ఉద్దేశంతో 51 ఏళ్ల వయసులో ప్రస్తుతం ఎం.ఎ. చేస్తున్నారు. ‘పరిస్థితులు అనుకూలించకపోయినా చదువుకోవాలనే కోరికను వదల్లేదు. నేను పట్టుదలతో చదువుకోవడం చూసి నా పిల్లలూ ఉన్నతవిద్యపై ఆసక్తి చూపారు. మా నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలని కలగన్నారు. వైద్యం చేసే డాక్టర్ని కాకపోయినా పీహెచ్‌డీతో ‘డాక్టర్‌’ అనిపించుకోవడం ఆనందంగా ఉంది. లక్ష్యాన్ని మరవకుండా కృషిచేస్తే విజయం తప్పక వరిస్తుందని నమ్ముతా’ అంటోన్న మంజుల చదువు కొనసాగించాలనుకునే ఎందరికో స్ఫూర్తిదాయకం కదూ!

ఇదీ చదవండి:

BADVEL BY-POLL : బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర

ABOUT THE AUTHOR

...view details