విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాలపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. 91, 92, 89, 90 వార్డుల్లో ర్యాలీలో పాల్గొన్న ఆయన.. వైకాపా అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయసాయిరెడ్డితోపాటుగా ఎంపీ ఎంవీ సత్యనారాయణ, మల్ల విజయప్రసాద్, బెహరా భాస్కర్ రావులు ర్యాలీలో పాల్గొని.. వైకాపాకు ఓటు వేసి సీఎం జగన్కు మద్దతు ప్రకటించాలని కోరారు.
మంత్రి అవంతి సమక్షంలో చేరికలు..
సింహాచలంలో మంత్రి అవంతి సమక్షంలో వైకాపాలోకి భారీగా కార్యకర్తలు చేరారు. తెదేపా మద్దతుదారులుగా ఉన్న విజినిగిరి పాలెంలో రైతులు, రైతు కుటుంబాలు వైకాపా సంక్షేమ పథకాలపై ఆకర్షితులై పార్టీలో చేరటం ఆనందించ దగ్గ విషయమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేద ప్రజల కోసమే అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 98 వార్డు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో మంత్రి సీదిరి అప్పలరాజు..
మంత్రుల రాకతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రచారాలతో హోరెత్తుతోంది. పశు సంవర్ధక, పాడి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని.. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రచారం..
జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపా కార్పొరేట్ అభ్యర్థులను గెలిపిస్తే విశాఖకు ధీటుగా అనకాపల్లిని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనకాపల్లిలో 83వ వార్డు వైకాపా కార్పొరేట్ అభ్యర్థిని జాజుల ప్రసన్న లక్ష్మీని గెలిపించాలని కోరారు. అనకాపల్లిని మరింత అభివృద్ధి చేసేందుకు వైకాపాకు మద్దతివ్వాలని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు దాడి రత్నాకర్ విజ్ఞాప్తి చేశారు.