విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన పోలీసు సిబ్బందిపై నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా వేటు వేస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్ధితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన చెబుతున్నారు. వేలకు వేలు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ కాసులకు కక్కుర్తి పడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
చీటింగ్ కేసులో...
విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడిపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేశారు. వేధింపులు తట్టుకోలేని బాధితుడు ఆనంద్ మొదటి విడతగా రూ.15 వేలు ముట్టజెప్పాడు. అయినా కానిస్టేబుళ్లు మరో 15 వేలు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చాడు. విసిగిపోయిన బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ బంగారు నాయుడుకు రూ.15 వేలు ఇవ్వగా తీసుకుని రైటర్ శ్రీనివాసరావు వద్ద ఉంచాడు. అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, రైటర్లపై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఆ స్టేషన్ సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విఆర్కు బదిలీ చేశారు.