Lowest Recorded Temperatures in the state: రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలు.. గజగజ వణుకుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే ఉంటున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, హుకుంపేట, జి.మాడుగులలో అత్యల్పంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీకే వీధిలో 2.2, గంపరాయి, డుంబ్రిగూడలలో 2.6, కొక్కిసలో 2.7, గొర్రెల మిట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1, దలపటిగూడలో 3.3, ముంచంగిపుట్టులో 3.8, భీమసింగిలో 4డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస, సీతంపేట, పాచిపెంట, సీతానగరం, సాలూరు, కురుపాం, మక్కువ, భామిని, బలిజపేట, శ్రీకాకుళం జిల్లా సోంపేట, కొత్తూరు, పాతపట్నం, కవిటి, లావేరు, విజయనగరం జిల్లాలో బాడంగి, తెర్లాం, రామభద్రాపురం మండలాల్లో కనిష్ఠంగా 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లాలోనూ 13 డిగ్రీలలోపే ఉష్ణోగ్రత ఉంది.
మన్యం అంతటా అతి శీతల వాతావరణం ఉంది. ఉదయం 10 గంటల వరకు లైట్ల వెలుతురులోనే వాహనాలు నడపాల్సి వస్తోంది. లంబసింగి, వంజంగి ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు, చేతికందే ఎత్తులో మంచు మేఘాలు, సూర్యోదయ దృశ్యాలను చూడడానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. జి.మాడుగుల మైదానాల్లో, పంట పొలాల్లో దట్టంగా మంచు దుప్పటి పరచుకుంది. వాహనాలపైనా మంచు దట్టంగా పేరుకుంటోంది. ఏలూరు జిల్లా.. జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, దేవరాపల్లి, చింతలపూడి, చాట్రాయి, బుట్టాయగూడెం, కామవరపుకోట, ఆగిరిపల్లి మండలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. 13 డిగ్రీల లోపు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల 10 నుంచి 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ఏలూరు, కర్నూలు, గుంటూరు, నంద్యాల తదితర జిల్లాల్లో 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాత్రి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల గణనీయంగా పడిపోయాయి. రాత్రి 8 గంటల నుంచే చలి గాలులు మొదలవుతున్నాయి. ఉదయం 10 గంటలకూ పొగ మంచు వీడటం లేదు. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల తర్వాత ఉత్తరాంధ్రలో పలుచోట్ల 7డిగ్రీల నుంచి 8డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవీ చదవండి: