పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పరిశీలన..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించారు. వొమ్మలి, చింతలూరు, గొటివాడ అగ్రహారం గ్రామాల్లో ఆరుగురు చొప్పున పోలీస్ సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై రామారావు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఎన్నికల నిబంధనలు పాటించి.. ఎంతో జాగ్రత్తగా విధులు నిర్వహించాలని మాడుగుల నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ అనిత అధికారులకు సూచించారు. చీడికాడలో ఎన్నికల నిర్వాహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ ప్రారంభం నుంచి.. కౌంటింగ్ నిర్వహణ వరకు శిక్షణ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో.. రెండు రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు.
అలసత్వానికి తావివ్వొద్దు..
ఎన్నికల నిర్వహణలో ఎక్కడా అలసత్వానికి తావివ్వకుండా చూసుకోవాలని పంచాయతీ ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్‌కుమార్ సూచించారు. నక్కపల్లిలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను బుధవారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్కు, నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లను చూశారు. కేంద్రంలోకి నిబంధనలకు లోబడే అభ్యర్థులను అనుమతిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా బలవంతపు ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా చూడాలని నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారి రవి జోసెఫ్, గోవిందరావులకు సూచించారు. ఏదైనా ఇబ్బందులున్నా, సమస్యలెదురైనా తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలని చెప్పారు. అధికారులు వీవీ రమణ, ఎన్.రమేశ్‌రామన్, కార్యదర్శి పీవీ రాజశేఖర్ పాల్గొన్నారు.
సమన్వయంతో విధులు నిర్వహించండి..
అధికారులంతా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల నోడల్ అధికారి లీలావతి సూచించారు. జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న చీడికాడ, చోడవరం, బుచ్చయ్యపేట మండలాల్లోని జిల్లా ఎన్నికల నోడల్ అధికారి లీలావతి విస్తృతంగా పర్యటించారు. అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లాలో తొలివిడత జరగనున్న పంచాయతీ ఎన్నికల మండలాల్లోని ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది సంబంధించి డిస్ట్రిబ్యూటర్, రిసెప్షన్, సామగ్రి ప్రదేశాలను పరిశీలన చేశామన్నారు.
వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా.. సర్పంచి పదవికి నామినేషన్