ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎప్పుడో.. పట్టాలపై పరుగులు!!

అరకు మార్గంలో కొత్త అద్దాల బోగీలు, ఎల్‌హెచ్‌బీ రైలు సిద్ధంగా ఉన్నాయి. వీటి ప్రారంభానికి ముఖ్యులు సమయం కేటాయించటం లేదు. దీంతో అవి పట్టాలపైకి రావడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

ఎప్పుడో.. పట్టాలపై పరుగులు
ఎప్పుడో.. పట్టాలపై పరుగులు

By

Published : Oct 30, 2021, 9:51 AM IST

రెండు కొత్త ఎల్‌హెచ్‌బీ రేక్‌లు, అద్దాల బోగీలు.. వాటికి అవసరమైన పవర్‌కార్‌లు ట్రయల్‌రన్‌ పూర్తి చేసుకుని సిద్ధమయ్యాయి. రైల్వేమంత్రి ఎప్పుడు జెండా ఊపితే అప్పటినుంచి విశాఖ-అరకు మార్గంలో పట్టాలపై పరుగులు పెట్టించడానికి అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. 15రోజుల క్రితం రైల్వేబోర్డుకు, రైల్వేమంత్రికి పంపిన ఈ రైలుకు సంబంధించిన ప్రతిపాదనను మాత్రం దిల్లీ యంత్రాంగం పక్కన పెట్టినట్లు సమాచారం. అసలు ఈ రైలును తిప్పాలా, వద్దా అనేది కూడా ఇంకా తేలలేదు. వీటి ప్రారంభానికి రైల్వేమంత్రి ఎప్పుడు అంగీకరిస్తారో స్పష్టత రావాలి. మరో వైపు వాల్తేరు డివిజన్‌ అధికారులు ఇప్పటి వరకూ పడిన శ్రమంతా వృథా అవుతుందా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.

* ప్రస్తుతం డివిజన్‌లో సిద్ధంగా ఉన్న 3 కొత్త అద్దాల బోగీలు గతంలో విశాఖకు తెచ్చాక.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాటిని అటు పంపారు. ఆ తర్వాత ‘ఈనాడు-ఈటీవీ’లో వచ్చిన వరస కథనాలతో రైల్వేబోర్డుస్థాయిలో పెద్ద చర్చే జరిగింది. ఆ బోగీలను తిరిగి వెనక్కి పంపేందుకు ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు విభేదించినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య అవి మళ్లీ అక్టోబరు 10వ తేదీకి ముందే విశాఖ వచ్చాయి. ఆ తర్వాత ఎల్‌హెచ్‌బీ రైలుతో కలిపి ప్రయోగాత్మక ప్రయాణం కూడా పూర్తిచేశారు. తరువాత అవి అలానే ఉన్నాయి.

ఆదాయం పోతోంది...

సాధారణ కోచ్‌లతో పోల్చితే ఎల్‌హెచ్‌బీ బోగీల్లో 10 సీట్లు అదనంగా ఉన్నాయి. పస్తుతం పాత విస్టాడోమ్‌ కోచ్‌ (అద్దాల బోగీ) ఒకటే తిరుగుతోంది. దీనిస్థానంలో ఇప్పుడు అవకాశమిస్తే రెండు కొత్త విస్టాడోమ్‌లు తిరుగుతాయి. కొత్త బోగీల్లో 4 అదనపు సీట్లున్నాయి. దీంతో రెండు అద్దాల బోగీల్లో మొత్తం 88 సీట్లు అందుబాటులోకి వస్తాయి. మరింత డిమాండ్‌ పెరిగితే మూడు విస్టాడోమ్‌ కోచ్‌లు, ఏసీ ఛైర్‌కార్లు కలిపి ప్రత్యేక రైలునే నడపొచ్చొనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రైలు నడవక రోజుకు ట్రిప్‌కు రూ.40వేల నుంచి రూ.80వేల వరకూ ఆదాయానికి గండి పడుతోందని విశ్లేషిస్తున్నారు.

‘వాల్తేరు’పై చిన్నచూపు...

దేశంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్న రైల్వే ఉన్నతస్థాయి ప్రతినిధులు అరకు రైలును ప్రారంభించేందుకు మాత్రం ఆసక్తి చూపడంలేదనే చర్చ నడుస్తోంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలే కనిపించాయి. సెప్టెంబరు 10న వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా భువనేశ్వర్‌-జగదాల్‌పూర్‌ హీరాఖండ్‌ ఎల్‌హెచ్‌బీ రైలును రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ ప్రారంభించారు. అదేరోజు విశాఖ నుంచి అమృత్‌సర్‌కు మొదలైన హీరాకుడ్‌ కొత్త ఎల్‌హెచ్‌బీ రైలు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. సాదాసీదాగా దాన్ని పట్టాలపైకి తెచ్చారు.

* ఏసీ ధరను చవకగా అందుబాటులోకి తెచ్చేలా దేశంలోనే వినూత్నంగా తయారుచేసిన తొలి ‘3ఏసీ’ ఎకానమీ కోచ్‌ను విశాఖకే కేటాయించారు. నెలక్రితం వచ్చిన ఈ కోచ్‌ను ఇప్పటిదాకా ఏ రైలుకూ అనుసంధానించలేదు. సమతా ఎక్స్‌ప్రెస్‌ను ఎల్‌హెచ్‌బీ రైలుగా ఉన్నతీకరించి ఈ కోచ్‌ జత చేయాలనే ఆలోచన ఉంది.అయితే అది కార్యాచరణలోకి రావటంపైనా అనుమానాలున్నాయి.

ఇదీ చదవండి:

FARMER SUICIDE: అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details