LG polymers tragedy: రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు (మే 7) విశాఖ సమీపంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీకైన స్టైరీన్ విషవాయువు ప్రభావమది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది ప్రజలు ఊపిరాడక అల్లాడిపోయారు. చాలామంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వాళ్లందరినీ తాము ఆదుకుంటామని ప్రభుత్వం మహాగొప్పగా చెప్పింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తామంది. ఆరోగ్య కార్డులు ఇస్తామని.. వాటితో ఎక్కడైనా, ఎన్నాళ్లైనా వైద్యం చేయించుకోవచ్చంది.
ఆ ప్రాంతంలో ఆర్వో ప్లాంటు ఏర్పాటుచేసి అందరికీ సురక్షిత తాగునీరు అందిస్తామంది. అప్పటికప్పుడు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకోవడం తప్ప.. రెండేళ్లవుతున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. వారు ఏమైపోయారో.. ఆ ప్రాంత వాసులకు ఏమవుతోందో తెలుసుకునే దిక్కు లేదు. కాసేపు మాట్లాడితే ఆయాసం.. తరచు దగ్గు.. కొద్ది దూరం నడిచినా అలసట. శరీరంపై మచ్చలు, దద్దుర్లు, కడుపులో మంట, ఒళ్లు నొప్పులు, కళ్లు మంటలు... రెండేళ్ల తర్వాత కూడా విశాఖపట్నం సమీపంలోని వెంకటాపురం వాసులకు ఈ బాధలు తప్పడం లేదు. పరిశ్రమకు సమీపంలో ఉన్నవాళ్లు, స్టైరీన్ గ్యాస్‌ను అధికంగా పీల్చినవారిని ఎక్కువగా చర్మ, జీర్ణకోశ, శ్వాస సంబంధ సమస్యలు బాధిస్తున్నాయి.
వారి మాటలు.. నీటిమూటలే:ఎల్‌జీ ఘటన తర్వాత ఈ ప్రాంతవాసులను ఆదుకోడానికి చాలా చేస్తామని ప్రభుత్వం హామీలు గుప్పించింది. నాటి మంత్రులూ ఇక్కడ అది చేస్తాం, ఇది చేస్తామన్నారు. తీరాచూస్తే.. రెండేళ్లవుతున్నా వాటి ఊసు లేదు. వెంకటాపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఏమైందో ఇంతవరకూ తెలియదు. తాత్కాలికంగా వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌ను అక్కడ ప్రారంభించారు.
దీనికోసం ఆర్భాటంగా అప్పటి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొన్నాళ్లకు శిలాఫలకమూ మాయమైంది. గ్రామంలోని పాఠశాలలో కొన్నాళ్లు వైఎస్‌ఆర్ హెల్త్‌క్లినిక్ పేరుతో ఆరోగ్య కేంద్రం నిర్వహించారు. కొవిడ్ అనంతరం పాఠశాలలు తెరిచాక ఆరోగ్యకేంద్రం మూతపడింది. దానికి సంబంధించిన సామగ్రిని ఓ గదిలో పడేసి తాళాలు వేశారు. కనీసం అక్కడ బీపీ యంత్రం కూడా లేదని గ్రామస్థులు చెప్పారు.
- ఆరోగ్య కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. వాటితో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని పేర్కొంది. దాని గురించి తర్వాత పట్టించుకోలేదు. సీఎం జగన్ ఫొటోతో కొందరికి 20 పేజీల పుస్తకం ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారో కనీసం వారి పేర్లయినా నమోదు చేయలేదు. అలా ఇచ్చినవి కూడా ఇప్పుడు దేనికీ ఉపయోగపడడం లేదంటున్నారు.
- గ్రామంలో ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనకే పరిమితమైంది. వెంకటాద్రి గార్డెన్స్‌లోని రెండు వీధుల్లో తప్ప మిగిలిన చోట ఎక్కడా రక్షిత తాగునీటి సరఫరా లేదని స్థానికులు పేర్కొన్నారు.