వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పాటైందని.. అర్ధ శతాబ్దంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి అయువుపట్టుగా ఎదిగిందని ఉత్తరాంధ్ర మేధావులు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కొరుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్లాంట్‌కు దాదాపు లక్షా ఏభై వేల కోట్ల రూపాయిల విలువైన భూములు ఉన్నాయన్నారు. గతంలో ఒక ప్రైవేట్ పోర్టుకు నామమాత్రపు ధరకు రెండు వేల ఎకరాలను కట్టబెట్టారని.. ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరించి విలువైన భూములు కార్పొరేటు సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు. వేల ఎకరాల వ్యవసాయ భూమిని రైతులు ఈ కర్మాగారం కోసం అప్పగించారన్నారు. ఇప్పటికి ఈ భూములు ఇచ్చిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు.
నవరత్న కంపెనీల్లో ఒకటిగా ఖ్యాతి..
ప్రస్తుతం 7.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పని చేస్తున్న ఈ కర్మాగారం.. ఇప్పటివరకు రూ. 42 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించిందని గుర్తుచేశారు. ఆర్ఐఎన్ఎల్ నవరత్న కంపెనీల్లో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించిందని లేఖలో పేర్కొన్నారు. గతంలో వేదాంత గ్రూప్‌కు అమ్మేసిన హిందుస్థాన్ జింక్ కంపెనీ.. యాజమాన్య నిర్వహణ లోపం కారణంగా మూతపడింది. ఇప్పుడా 365 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చేందుకు యత్నాలు జరుగుతున్నాయని వివరించారు. గతేడాది మేలో ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన దుర్ఘటనకు ప్రైవేటు యాజమాన్యం జరిగిన నిర్లక్ష్యం వల్లనే జరిగిందన్నారు.