కేవలం మహిళా సిబ్బందితోనే నడిచే ప్యాసింజర్ రైలును విశాఖలో ఇవాళ ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశాఖ -రాయగడ ప్యాసింజర్ రైలును తూర్పు కోస్తా రైల్వే విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు పారిజాత సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే విషయాన్ని తెలియజేయటం కోసం కేవలం మహిళా ఉద్యోగినులచే నడిచే విధంగా రైలును ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.
ఈ రైలులో ఇంజన్ డ్రైవర్ ( లోకొపైలెట్), గార్డ్, టిక్కెట్ చెకింగ్ స్టాఫ్, ఆర్ఫీఎఫ్ సిబ్బందితో పాటు అందరూ మహిళలు ఉంటారని తెలిపారు. రైల్వేలో దాదాపు అన్ని విభాగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కీలకమైన విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించేందుకు తమ సంస్ధ కృషి చేస్తుందని పారిజాత సత్పతి తెలిపారు.