వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ) మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై ఎక్కున సంఖ్యలో రహదారులపైనే అభ్యంతరాలొచ్చాయి. ఆ తరువాత భూమి వినియోగం, సర్వే నంబర్ల మార్పుల గురించి వచ్చాయి. కొత్త ప్రణాళిక అమలుకు వీఎంఆర్‌డీఏ కసరత్తు వేగవంతం చేసింది. మరో నెల రోజుల్లో దీనికి తుదిరూపు తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మార్పులు చేసిన చిత్రపటాలను సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఆ దిశగా ప్రణాళిక విభాగ ఉద్యోగులను జోన్ల వారీగా విభజించి ప్రత్యేక సామర్థ్యం కలిగిన కంప్యూటర్లు ఏర్పాటు చేసి పని చేయిస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రాథమిక వివరాల సేకరణ, వాటి మదింపు దాదాపు చివరి దశకు వచ్చింది. మరోవైపు క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకున్న నివేదికల ఆధారంగా మార్పులు చేయాల్సినవి గుర్తించారు.
11వేలకు పైగా అభ్యంతరాలు
మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించేందుకు కొద్ది రోజులుగా ఉద్యోగులు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడిన ఉద్యోగులు జోన్ల వారీగా వచ్చిన వాటిని మదింపు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ, నైపుణ్యం కలిగిన సిబ్బందిని వినియోగిస్తున్నారు. మొత్తంగా అన్ని విభాగాల నుంచి 11,047 అభ్యంతరాలు వచ్చినట్లు తుది జాబితా సిద్ధం చేశారు. దీని ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో వీటిని నాలుగు అంశాలుగా విభజించారు. వీటిల్లో రహదారుల మార్పు, భూముల వినియోగం, చేర్చాల్సిన సర్వే నంబర్లు ఇతర వాటిపై వచ్చినవిగా గుర్తించారు.
విజయనగరం నుంచే అధికం
వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో సగానిపైగా అభ్యర్థనలు రహదారుల మీదే వచ్చాయి. అన్ని జోన్లలోనూ మిగిలిన వాటికన్నా వీటిపైనే ఎక్కువగా ఉన్నాయి. విజయనగరం గ్రామీణం నుంచే 1734 అభ్యంతరాలు రాగా వీటిల్లో అధికంగా భోగాపురం ప్రాంతంలోనివే ఉన్నాయి. ఆ తరువాత భీమిలి నుంచి 1624, పెందుర్తి 680, ఆనందపురం 520, విజయనగరం 526 ఉన్నాయి. మేఘాద్రిగెడ్డ బఫర్ జోన్‌కు సంబంధించి ఉద్యానవనం ఏర్పాటుపై రాంపురం, చింతలగ్రహారం నుంచి 129 అభ్యంతరాలు వచ్చాయి. విజయనగరం 45 మీటర్ల అంతరవలయ (రింగు)రోడ్డుపై వివిధ రకాలుగా వెయ్యికిపైగా వచ్చాయి.
ఇదీ చదవండి