List of Prohibited Lands: నిషిద్ధ భూముల జాబితాల్లో చేర్చిన భూములను.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు అనుసరించి చేర్చారా.. లేదా అన్నదానిపై జిల్లాల్లో పరిశీలన జరుగుతోంది. నిషిద్ధ జాబితాలో చేర్చిన భూములను విడిపించడమే బాధితులకు సవాలుగా మారింది. బాధితుల దరఖాస్తులను జిల్లా అధికారులు తిరస్కరిస్తున్నారు. పలుకుబడి ఉన్నవారికి త్వరగానే పరిష్కారం లభిస్తోంది. ఇటీవల తమ భూములను నిర్దేశించిన కేటగిరీలో కాకుండా.. మరో కేటగిరీలో పెట్టారని బాధితులు ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. కేటగిరీల వారీగా భూములు చేర్చడంలో తారుమారు జరిగినట్లు వస్తున్న ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.
నిషిద్ధ జాబితా కింద 22-1ఏ నుంచి 1ఈ మధ్య ఏయే భూములు చేర్చాలో.. ఇప్పటికే రకరకాల ఉత్తర్వులు ఉన్నాయి. 22-1ఏలో ఎసైన్డ్, బి-ప్రభుత్వ భూములు, ఇతర కేటగిరీల్లో ఎలాంటి భూములు చేర్చాలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినా రెవెన్యూ అధికారులు భూముల వివరాల నమోదులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారన్న ఆరోపణలు మరోసారి రుజువైంది.