ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Complaint On Land Grabbing: విశాఖలో భూఅక్రమాలు.. స్పందనలో ఫిర్యాదు

Land Grabbing Complaint In Spandana: విశాఖలోని పలు భూ అక్రమాలపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ కార్పొరేటర్లు స్పందనలో భూ అక్రమాలపై కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. వేల కోట్ల విలువచేసే భూములను ఆక్రమించి.. వాటిని వాణిజ్యపరమైన వాటికి అద్దెకు ఇస్తూ లక్షల రూపాయలు అర్జిస్తున్నారని​ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 17, 2023, 9:27 PM IST

Land Grabbing Complaint In Spandana Programme at Visakha: విశాఖలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పలు భూఅక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అక్రమాలకు గురైనట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. రాజకీయ బలంతోనే ఈ కబ్జాల పర్వం సాగుతోందని విమర్శించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కబ్జాలకు గురైన భూములను నగరాభివృద్ధికి వినియోగించాలని కోరారు.

శాంతి ఆశ్రమ భూముల కబ్జా: విశాఖలోని శాంతి ఆశ్రమ భూముల కబ్జాలపై స్పందన కార్యక్రమంలో కలెక్టర్​కు, జీవీఎంసీ కమిషనర్​కు జనసేన కార్పొరేటర్​ మూర్తియాదవ్​ ఫిర్యాదు చేశారు. బీచ్ రోడ్​లోని జాలరిపేట సముద్రతీరంలోని శాంతి ఆశ్రమం భూములు, ప్రభుత్వ భూములు, యూఎల్​సీ భూములన్నీ కలిపి.. 15 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురయ్యాయని మూర్తి యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జా చేసిన ఈ భూములను లక్షల రూపాయలకు వాణిజ్య కార్యకలపాలకు అద్దెకు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వంలోని ప్రధాన వ్యక్తుల బినామీ ఆస్తులు కూడా కబ్జాల్లో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి వెయ్యి కోట్లకు పైగా విలువ చేసే ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని మూర్తియాదవ్​ డిమాండ్​ చేశారు. ఆశ్రమంలో పనిచేసిన వారు కూడా కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ పలుకుబడితో హస్తగతం చేసుకున్నారని అన్నారు. లంచాలకు లొంగిపోయి విద్యుత్ శాఖ అధికారులు అక్రమ నిర్మాణాలకు విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారని.. నగర పాలక సంస్థ అధికారులు పన్నులు విధిస్తున్నారని విమర్శించారు.

నగరం నడిబొడ్డున జరుగుతున్న ఈ అక్రమాలపై అధికారులు స్పందించకపోవటం విడ్డూరమని అన్నారు. నగరాభివృద్ధికి ఈ స్థలం విలువైనదని వివరించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని మత్స్యకారుల సంక్షేమం కోసం అధునాతనమైన ఫిష్ మార్కెట్ ప్రాసెసింగ్ సెంటర్లను నిర్మించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విశాఖ పరిధిలో వెయ్యి మందికి పైగా సాంప్రదాయ మత్స్యకార వ్యాపారులున్నారని.. వారందరికి కబ్జాలకు గురైన భూమి అనువైన స్థలమని పేర్కొన్నారు.

ఎంపీ ఎంవీవీపై కబ్జా ఫిర్యాదు: విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణపై 87వ డివిజన్ కార్పొరేటర్ బోండా జగన్నాథం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎంవీవీ అండ్​ ఎంకే సిటీ నిర్మాణం కోసం.. శ్మశానాన్ని.. జీవీఎంసీ పార్క్ స్థలాన్ని కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంవీవీ నిర్మాణంలో భాగంగా నిర్మాణం వెనుక భాగంలో ఉన్న రైవాడ నుంచి వచ్చే కాలువను సైతం కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని లేకపోతే.. న్యాయపోరాటానికి సిద్ధం కానున్నట్లు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details