పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ప్రారంభించిన భూ సేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు సాగుతునే ఉంది. రైతులకు చాలా మేర పరిహారం చెల్లింపు ప్రక్రియ తెదేపా హాయంలోనే జరిగింది. దీనిలో భాగంగా అంకుర ప్రాంతాన్ని(స్టార్టప్ ఏరియా) సిద్ధం చేశారు. తర్వాత కాలంలో కొంత స్తబ్దత నెలకొంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తిరిగి దీనిపై మరింత దృష్టి సారించింది. ఈ క్రమంలో పరిహారం చెల్లించనంత మేర భూములను ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆదేశాలు ఇచ్చింది.
రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం, చందనాడ, బుచ్చిరాజుపేట, డీఎల్‌పురం తదితర గ్రామాల పరిధిలో సేకరణ చేపట్టగా, సుమారు 4200 ఎకరాలను గుర్తించారు. ఇందులో 2300 ఎకరాల వరకు జిరాయతీ కాగా, మిగిలిన దానిలో డీఫాం, ప్రభుత్వ బంజరు ఉంది. వీటిలో జిరాయతీకి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించగా, డీఫాం, బంజరు సాగులో ఉన్న రైతుల్లో అర్హులను గుర్తించి దాదాపుగా వీరికి పరిహారం ఇచ్చారు. దీనికితోడు పాటిమీద, మూలపర్ర తదితర ప్రాంతాల్లో సేకరించిన భూముల్లో ఉన్న పక్కా భవనాలు, షెడ్లు, ఇళ్లు, పంట, చెట్లకు ఇలాంటి వాటికి కొంత మేర పరిహారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మరికొందరికి చెల్లింపులు చేయాల్సి ఉంది.
స్వాధీనమే తరువాయి:
అంకుర ప్రాంతంగా గుర్తించిన 1120 ఎకరాలను ముందుగా స్వాధీనం చేసుకోడానికి అధికారులు యోచిస్తున్నారు. తక్షణమే ఆయా గ్రామాల్లోకి వెళ్లి కార్యాచరణ చేపట్టాలన్న కలెక్టర్ సూచనతో ఇప్పటికే అధికారులు అడుగులు వేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో భాగంగా పాటిమీద సమీపంలో భారీ విద్యుత్తు ఉప కేంద్రం ఏర్పాటుకు 10 ఎకరాల భూమిని కేటాయించారు. కొద్దిరోజులుగా ప్రత్యేక ఉప కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే అధికారులు, గ్రామస్థాయి ఉద్యోగులు ఆయా గ్రామాల్లో పరిశీలన చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత, కార్మికులు, కూలీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
రైతుల నుంచి నిరసనలు