ఓ పేద గిరిజన రైతు తన ఇంటి విద్యుత్ బిల్లు లక్షల్లో రావడంతో లబోదిబోమంటున్నాడు. ఏడాది కాలం నుంచి తన బిల్లులో మార్పు లేదని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
వివరాల్లోకి వెళితే..
విశాఖ జిల్లా పాడేరు సిల్వర్ కాలనీలో కృష్ణారావు అనే ఆదివాసీ గిరిజన తెగకు చెందిన వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నవంబర్‌లో ఆయన ఉంటున్న ఇంటికి రూ.1,39,848 బిల్లు రాగా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటినుంచి మీటరు రద్దు చేశారన్నారు. అంతకుముందు తరచూ రూ.500 వరకు బిల్లు వస్తుండేదన్నారు. ఈ క్రమంలో ఈ నెలలో మరోసారి రూ.1,40,248 బిల్లు వచ్చిందని వాపోయారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండు నోటీసు సైతం జారీ చేసినట్లు చెప్పారు. ఈ విషయంలో తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవోకు బాధితుడు ఫిర్యాదు చేశారు.