కరోనా ప్రభావంతో భారత్‌కు వచ్చే విమానాలు రద్దు కావటంతో ఫిలిప్పీన్స్‌లోని మనీలా విమానాశ్రయంలో పలువురు తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. గత 40 గంటలుగా సరైన నిద్రాహారాలు లేక.. వారంతా పడిగాపులు కాస్తున్నారు. మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి 185 మంది విద్యార్థులు.. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వారూ ఉన్నారు. మనీలాలో మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు నిలిచిపోయారు. వీళ్లంతా కౌలాలంపూర్ మీదుగా భారత్‌కు వచ్చేందుకు ఎయిర్ ఏసియా విమానంలో టిక్కెట్లు బుక్ చేసకున్నారు. కానీ.. భారత్‌కు వచ్చే విమాన సర్వీసులు మంగళవారం నుంచి రద్దు చేయటంతో తెలుగు విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. వీరిలో కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం సహా తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ప్రాంతాల వాసులూ ఉన్నారు.
మలేసియాలోని కౌలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు.. ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 150 మంది వరకూ తెలుగు విద్యార్థులే ఉన్నారు. రెండు విమానాల్లో వీరిని భారత్‌కు తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల వారిని విశాఖపట్నానికి, ఉత్తరాది వారిని దిల్లీకి తీసుకువచ్చారు.బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్న విమానంలో 91 మంది ఆంధ్రప్రదేశ్, ఏడుగురు తెలంగాణ, 78 మంది తమిళనాడుకు చెందినవారు కాగా... మిగిలినవారంతా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఒడిశా, గోవా వాసులు ఉన్నారు.