విశాాఖ కింగ్ జార్జి ఆసుపత్రి విశ్రాంత పర్యవేక్షక వైద్యాధికారి (సూపరింటెండెంట్) డాక్టర్ మల్లవరపు శ్రీరామ్ (82) ఆదివారం నగరంలోని తన స్వగృహంలో మృతి చెందారు. నిద్రలో ఉండగానే గుండెపోటుతో చనిపోయారని కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య డాక్టర్ లీలా శ్రీరామ్ (కేజీహెచ్ మైక్రోబయాలజీ విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు), కుమారుడు డాక్టర్ రవీంద్ర, కుమార్తె అనూరాధ ఉన్నారు.
కేజీహెచ్ అనస్తీషియా విభాగాధిపతి, ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.వి.కృష్ణారావు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు. డాక్టర్ శ్రీరామ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్తీషియాలజిస్ట్ (ఐఎస్‌ఏ)లో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఎ.పి. సింఘాల్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. డాక్టర్ శ్రీరామ్ మృతి పట్ల ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ సంతాపం తెలిపారు.