విశాఖలోని కేజీహెచ్ బాధితులతో నిండిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరగడంతో.. తెల్లవారుజామున 5 గంటల నుంచి అత్యవసర విభాగానికి బాధితులు రావడం ప్రారంభమైంది. వచ్చినవారికి వైద్య సేవలందించారు. విషమంగా ఉన్నవారిని ఐఎండీ, ఐఆర్‌సీయూలకు తరలించారు. 300 మంది సీనియర్, జూనియర్ వైద్యులు బాధితులకు సేవలందించారు. మధ్యాహ్నం వరకు బాధితులు వస్తూనే ఉండటంతో కొంతమందిని ప్రైవేటు ఆసుపత్రులకు పంపారు.
44 మంది చిన్నారులు విలవిల
అస్వస్థతకు గురైన 44 మంది చిన్నారులను పిల్లల వార్డులో చేర్చారు. కానీ వారి తల్లిదండ్రులు మరోచోట చికిత్స పొందాల్సి రావడంతో పిల్లలు తల్లడిల్లిపోయారు. పిల్లలకు ఏమైందో అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.