Visakhapatnam steel plant latest news: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, ప్రజలు, కార్మికులు కలిసి రావాలని.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, సీబీఐ మాజీ జేడీ నారాయణలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. విశాఖలోని కన్వెన్షన్ సెంటర్‌లో నేడు కేఏ పాల్, వి.వి లక్ష్మీ నారాయణలు కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ..''విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో నేను మూడు నిర్ణయాలు తీసుకున్నాను. అందులో మొదటిది.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకూడదు. రెండవది..ప్రైవేటీకరణ పేరుతో స్టీల్‌ప్లాంట్‌ను ఆదానీ, అంబానీలకు అమ్మకూడదు. మూడవది.. ఒకవేళ స్టీల్‍ప్లాంట్‌ను అమ్మాలని అనుకుంటే మా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేయండి.. ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా దానిని మేము నిష్పక్షపాతంగా నడిపించుకుంటామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది విశాఖపట్టణంలోనే.. మా ఉరిలో ఉన్న సంస్థలను పక్కవారికి అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోము. కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం'' అని ఆయన అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా దిల్లీలో ఉన్న పెద్దలతో పోరాటం చేస్తానని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ దాదాపు 32 మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఏర్పడిందని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో వైసీపీ సభ్యులు ఉండి కూడా స్టీల్‌ప్లాంట్ విషయంలో సీఎం జగన్ ఏం చేయగలిగరని కేఏ పాల్ ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమ్ముతామంటే అడిగిన దానికి ఎక్కువ చెల్లించి తానే కొంటానని కేఏ పాల్ పేర్కొన్నారు.