ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా మార్చిన పరిస్థితులు... రద్దీగా మారిన శ్మశానాలు! - కరోనా మృతులతో జ్ఞానాపురం శ్మశానం రద్దీ

శ్మశానం అంటేనే నిశ్శబ్ద వాతావరణం. ఎవరో చనిపోయినప్పుడు తప్పితే.. చడీచప్పుడు ఉండదు. అలాంటి శ్మశానం ఇప్పుడు రద్దీగా మారింది. ఒకసారి తెరిచిన గేటు మూయడం లేదు. ఒక వాహనం వెళ్లేసరికి.. మరో వాహనం మృతదేహాలను మోసుకొస్తోంది. శ్మశానవాటికలో ఎక్కడ ఖాళీ ఉంటే..అక్కడే కొరివి పెడుతున్న దృశ్యాలు హృదయాల్ని దహించి వేస్తున్నాయి.

rush in jnanapuram  cemetery
రద్దీగా మారిన శ్మశానాలు

By

Published : Apr 23, 2021, 7:23 AM IST

జ్ఞానాపురం శ్మశానంలో చల్లారని చితి మంటలు

విశాఖ జ్ఞానాపురం శ్మశానవాటికలో చల్లారని చితిమంటలు.. కరోనా మారణ హోమానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి.. జ్ఞానాపురం శ్మశానవాటికలో కేవలం 10 నుంచి 15 మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు.. సరిపడా ప్లాట్‌ఫాంలే ఇక్కడున్నాయి. గతంలో రోజుకు నాలుగైదు మృతదేహాలే ఇక్కడకు వచ్చేవి. ఉన్న ప్లాట్‌ఫాంలే పూర్తిగా వినియోగించే అవసరం రాకపోయేది. కానీ..కరోనాతో పరిస్థితి తారుమారైంది.

మృతదేహాల రద్దీతో అంత్యక్రియలకు ప్లాంట్‌ఫాంలు సరిపోవడం లేదు. చేసేదేమీలేక శ్మశానవాటిక ఆవరణలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చితిపేర్చేసి.. దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ ఆరని చితిమంటలు.

కొవిడ్‌ మృతులకు విశాఖ నగరంలో మరెక్కడా దహనం చేసేందుకు అనుమతి లేకపోవడం వల్ల ఈ శ్మశాన వాటికకు రద్దీ పెరిగింది. గురువారం ఒక్కరోజే 40కిపైగా మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు. ఆస్పత్రుల నుంచి అంబులెన్స్‌లు నేరుగా ఇక్కడకు రావడం.. అందులో ఉన్న మృతదేహాలను వరుసపెట్టి దహనం చేయడం.. సిబ్బందికీ తలకుమించిన భారంగా మారింది. ఒకే అంబులెన్స్‌లో దాదాపు 8 మృతదేహాలు తెచ్చిన సందర్భం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. ప్లాట్‌ఫాంలు ఖాళీ లేకపోవడంతో.. ఆవరణలో ఖాళీగా ఉన్నచోట కట్టెలు పేర్చేసి దహనం చేస్తున్నారు. సమయానికి తినేందుకు వీల్లేని పని ఒత్తిడి ఉందని వాపోతున్నారు.

బంధువులు రావటం లేదు...

కొవిడ్ మరణాలు కావడంతో చాలావరకూ బంధువులెవరూ అంతిమ సంస్కారాలకు రావడం లేదు. ఒకరిద్దరు వచ్చినా అక్కడి పరిస్థితులు చూసి ఆక్రోశిస్తున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వస్తారనుకున్నవారిని.. ఇలా శ్మశానంలో చూడాల్సి వస్తోందనుకోలేదంటూ వాపోతున్నారు..

కొవిడ్ నిబంధనల ప్రకారమే...

కొవిడ్ నిబంధనల ప్రకారమే మృతదేహాలు దహనం చేస్తున్నామని జ్ఞానాపురం శ్మశానవాటికి సిబ్బంది చెప్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా కలవరం: ఆక్సిజన్‌ మీదే 60% మంది

ABOUT THE AUTHOR

...view details