Janasena : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. భవిష్యత్తులో ఇరువురి మధ్య మరిన్ని సమావేశాలు ఉంటాయని చెప్పారు. ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు, పవన్ భేటీ అవశ్యం అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పని చేస్తోందని.. ఈ మేరకు రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. విశాఖలో భూదందాలపై జనసేన పోరాటం చేస్తోందని ఈ సందర్భంగా మనోహన్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు.. ‘నువ్వే మా నమ్మకం జగనన్న’ అని స్టిక్కర్లు అంటిస్తున్నారు కానీ, క్షేత్రస్థాయిలో జగనన్నపై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన యువతను హింసిస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు.
పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయిందని మనోహర్ ఆరోపించారు. నిందితులపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టడం బాధాకరమని అన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో క్షీణించింది... ఎక్కడ చూసినా లిక్కర్ దందా, ఇసుక మాఫియా, కొండలు కొల్లగొట్టడం వంటి దందాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఏ ఒక్కరు ప్రశ్నించినా సరే.. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజ్యసభ సభ్యుడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటర్లను బెదిరిస్తుంటే.. మహిళలు అడ్డుకుని గొడవ చేయడంతో పోలీసులు ఇష్టారాజ్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఈ సందర్భంగా ఉదహరించారు.