pawan kalyan fan revati : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని, విశాఖకు చెందిన చిన్నారి రేవతి గుర్తుందా.. పవన్.. నాలుగేళ్ల కిందట విశాఖలో పర్యటించిన సందర్భంలో ఓ నిరుపేద తల్లి తన చిన్నారిని ఒడిలో పెట్టుకుని దగ్గరకు తీసుకువచ్చింది. మస్క్యులర్ డిస్ట్రోఫీ.. అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న ఆ చిన్నారికి పవన్‌ను చూడాలని కోరిక. ఈ విషయం తెలిసిన పవన్.. బాలికను దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి తెలిసి, స్వయంగా చూసి చలించిపోయారు. ఆమెకు ఆర్థిక సాయం అందించారు. వ్యాధి కారణంగా నరాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ జీవచ్ఛవంలా మారుతున్న ఆ చిన్నారికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా అందించారు.
మస్క్యులర్ డిస్ట్రోఫి వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రేవతి.. కన్నుమూసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. చిన్నారి రేవతి మరణం తీవ్రంగా బాధించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. నాలుగేళ్ల కిందట తాను పోరాట యాత్ర చేస్తున్న సమయంలో విశాఖ నగరంలో తనను కలిసిన రేవతి చనిపోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన రేవతి.. ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉండేదని.. నాలుగేళ్ల కిందట ఆ చిన్నారి కలిసేనాటికి ఏడెనిమిదేళ్ళ వయస్సు ఉంటుందని గుర్తు చేసుకున్నారు.