విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట ఒక కుగ్రామం. 1992లో కర్రి సీతారాం అనే వ్యక్తి చేసిన ప్రయత్నాలు అక్కడి మహిళల అభివృద్ధికి రాచబాటగా మారాయి. రాత్రి బడులను నిర్వహించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. ప్రధానంగా కుటుంబ అవసరాలకు పనికొచ్చే విధంగా పొదుపు రుణ వితరణ వంటి ఆశయాలతో ఆరంభించి, తర్వాత జనమిత్ర పరస్పర పొదుపు సహకార సంఘంగా మార్పు చేశారు. డ్వాక్రా మహిళా ఉద్యమం ఆరంభానికి ముందుగానే ఈ రకమైన పొదుపు మంత్రాన్ని ఇక్కడి మహిళలు పాటించేలా చేయగలిగారు.
అచ్యుతాపురం పరిసరాల్లోని 6 మండలాల్లో 150కి పైగా గ్రామాల్లో సుమారు 13 వేల మంది మహిళలు జనమిత్రలో సభ్యులుగా ఉన్నారు. వీరికి వివిధ ఆర్థిక కార్యకలాపాలకు, వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు ఇవ్వడం తిరిగి చెల్లించడం ఉంటుంది. మరోవైపు మహిళలకు వివిధ అంశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. వీరు చేస్తున్న ఆర్థిక కార్యకలాపాలు జాతీయ స్థాయిలో నాబార్డు, సిడ్బీ వంటి వాటి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఆర్గానిక్ రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహించే దిశగా ఈ సంస్థ ప్రస్తుతం అడుగులు వేస్తోంది.