Jana Jagarana Samithi State Convener: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నమ్మకం, చిత్తశుద్ధి ఉంటే విశాఖలో త్వరలో జరగనున్న బహిరంగ సభలో ప్రధానితో మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేయించగలరా అని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ సూరె లక్ష్మీ నారాయణ(వాసు) వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు ప్రారంభం నుంచి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో.. మోదీతో మూడు రాజధానులపై ప్రకటన చేయించాలని సవాలు విసిరారు. మూడు రాజధానుల నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ.. కొందరు నేతలు ప్రజల్ని రెచ్చగొడు తున్నారని ఆరోపించారు. విశాఖ భూకుంభకోణంతో పాటుగా.. రుషికొండ విధ్వంసంపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. భూకబ్జాదారుల నుంచి విశాఖను విముక్తి చేయాలని కోరారు. తన మద్దతు అమరావతికా.. మూడు రాజధానులకా అన్న విషయమై ప్రధాని స్పష్టత ఇచ్చి.. రాష్ట్రప్రజలను విద్వేషపూరిత రాజ కీయాల నుంచి రక్షించాలని కోరారు.
భూకుంభకోణాలపై సీబీఐ విచారణ:విశాఖ భూకుంభకోణాలపై సీబీఐ విచారణ జరిగితే విజయసాయిరెడ్డి బాధితులు పెద్దసంఖ్యలో బయటకు వస్తారని తెలిపారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ పది తరాల ఆస్తులను కూడబెట్టారు గానీ ఏ రోజూ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడలేదన్నారు. మంత్రులు పదేపదే 'మా ప్రాంతవాసులు' అంటున్నారని, వారు రాష్ట్రం మొత్తానికి మంత్రులని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిజంగా రైతులు తలచుకుంటే విజయవాడ, గుంటూరుల్లో వారు తిరగగలరా.. అని ప్రశ్నించారు. ప్రజల డబ్బుతోనే ఓట్లు కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల డబ్బుతో ఉచితాలు ఇస్తూ ప్రభుత్వం ఓట్లు కొంటోందని 'తెలుగు దండు' వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిశయనసూరి పేర్కొన్నారు.