సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మహానగరం.. హామీల అమలులో జగన్ వైఫల్యం CM failure to implement promises given to Visakha: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ, ఐటీ మళ్లీ జీవం పోసుకునేందుకు పెండింగ్‌లో ఉన్న అన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలను రెండు దశల్లో క్లియర్ చేస్తామని.. 2020 మే 1న సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటించారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో.. విద్యుత్తు వినియోగించినా, లేకున్నా వారు చెల్లించాల్సిన స్థిర విద్యుత్తు, కనీస డిమాండ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నామన్నారు. విశాఖలో ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామంటూ పెట్టుబడుదారుల సదస్సు, జీ-20ల్లో ఆర్థిక, పరిశ్రమలశాఖ మంత్రులు ఊదరగొట్టారు. ఆ తర్వాత వాటి ఊసే లేదు. కనీసం ఐటీ పార్కుకు ఆర్టీసీ బస్సులు నడపాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఎన్నిసార్లు విన్నవించినా అతీగతీ లేదు. కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీలకు విద్యుత్తు ఎండీ ఛార్జి, ప్రాపర్టీ ఛార్జీలు రద్దు చేస్తామని స్వయానా సీఎం జగన్ ప్రకటించినా ఇంతవరకు అమలు చేయలేదు.
ALSO READ:జగనన్న.. విశాఖ ఉక్కుకోసం ఓ బటన్ నొక్కండి! కార్మిక సంఘాల వేడుకోలు..!
మూతపడిన ఐటీ కంపెనీలు.. విశాఖలోని ఐటీ కంపెనీలకు నాలుగేళ్లుగా చెల్లించాల్సిన, రాయితీలు, ప్రోత్సాహకాలు సుమారు 100 కోట్ల మేర పేరుకుపోయాయి. నిధుల విడుదలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ అడ్డువచ్చిందని.. కోడ్ ముగియగానే ఇస్తామంటూ తప్పించుకున్న మంత్రి అమర్‌నాథ్.. ఇప్పటీ దీని ఊసే ఎత్తడం లేదు. టీడీపీ హయాంలో డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పాలసీ ఉండేది. ఐటీ పార్కులో ఏ కంపెనీ దరఖాస్తు చేసుకున్నా.. సగం అద్దెకే ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్, నిరంతర విద్యుత్తు సౌకర్యం కల్పించేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పాలసీ నిలిచిపోయింది. ఫలితంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు వంద వరకు మూతపడ్డాయి. ఆ కంపెనీలకు సంబంధించిన అద్దె బకాయిలు నాలుగేళ్లుగా చెల్లించలేదు.
ఒక్క ఇల్లూ పూర్తికాలేదు.. గత ఏడాది ఏప్రిల్ 28న సబ్బవరం బహిరంగ సభలో విశాఖ, సబ్బవరానికి చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను.. సీఎం జగన్ పంపిణీ చేశారు. అనకాపల్లి శివారులోని ఎరుకనాయుడుపాలెం, పైడివాడ అగ్రహారంలో 13 వేల ఇళ్ల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో ఏడాదిలో ప్రభుత్వమే ఈ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తుందంటూ హామీ ఇచ్చారు. మొత్తం సబ్బవరం మండలంలో ఏడు లే-అవుట్లలో 50 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క లే-అవుట్‌లోనూ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. కొన్ని చోట్ల పునాదులే తీయలేదు.
హడావుడిగా శంకుస్థాపనలు..విశాఖలో తాగునీటి సమస్య తీరుస్తానని అధికారాన్ని చేపట్టిన 3నెలల తరువాత తనను కలిసిన స్థానిక వైసీపీ నేతలకు జగన్ హామీఇచ్చారు. సుమారు 3వేల 338 కోట్లతో ఏలేరు నుంచి విశాఖకు నేరుగా పైపులైను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితమయ్యాయి. 2019 డిసెంబరులో విశాఖకు వచ్చిన జగన్ పలు ప్రాజెక్ట్‌లకు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. ప్రతి నియోజకవర్గానికి ఈతకొలను, ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. నగర ప్రజలకు వైజ్ఞానిక ఆనందాన్ని ఇచ్చేలా 37 కోట్లతో ప్లానిటోరియానికి శంకుస్థాపన చేశారు. అంచనా వ్యయం పెరిగి పోవడంతో ప్రాజెక్టుపై కదలిక లేకుండా పోయింది. చారిత్రక మ్యూజియం, పరిశోధన సంస్థకు కాపులుప్పాడలో రెండెకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 60 కోట్లతో చేపట్టిన బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్ పనుల తీరూ అలాగే ఉంది.
గాల్లో కలిసిన హామీలు.. గత ఏడాది విశాఖ పర్యటనలో జగన్.. తూర్పు నియోజకవర్గానికి హామీలు గుప్పించారు. హనుమంతవాక ఫ్లైఓవర్‌కు 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రతిపాదనలే అటకెక్కాయి. ఫలితంగా నిత్యం నగరవాసులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, 20 కోట్లు విడుదల చేస్తామని చెప్పినా నిధుల ఊసేలేదు. పాండురంగపురంలోని రజకులకు ఇళ్లు నిర్మిస్తామన్న హామీ సైతం గాలిలో కలిసిపోయింది.